17, జనవరి 2021, ఆదివారం

ధర్మం

భగవంతుడిని ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, త్రేతాయుగంలో శ్రీరాముడు, కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడుగా కొలుస్తునే ఉన్నాం. మనం చేసే పాపపుణ్యములనుబట్టే మనకి జన్మనిస్తాడట భగవంతుడు. అన్ని జన్మలలోకి అతిగొప్పది మానవజన్మ. అంత విలువైన జన్మని మనం ఎంతవరకు సార్ధకము చేసుకుంటున్నాము? 

పంచేంద్రియాలు మనిషితోపాటు అన్ని ప్రాణులకు ఇచ్చాడు భగవంతుడు. అన్నిజీవాలు నోటిని తినడానికి మాత్రమే ఉపయోగిస్తే దానిని భగవన్నామస్మరణకి వాడే భాగ్యం మనిషికి మత్రమే ఉంది. దుర్వినియోగమే ఎక్కువ చేస్తున్నాం మనం.

మనిషికి కోరికలు అనంతం. జీవితం నీటిబుగ్గలాంటిదని తెలిసీ సుఖాలకోసం ప్రాకులాడుతాడు. చివరికి భగవంతునికి చేసే పూజకూడా స్వార్ధపూరితమైన కోరికలకోసమే చేస్తాంకదా?

**************************************************************************

కైకసి పుతృలైన రావణ, కుంభకర్ణ, విభీషణులు బ్రహ్మదేవుని అనుగ్రహంకోరి ఘోరతపస్సు చేసారట. రావణుడు వేయి సంవత్సరాల తపస్సు పూర్తికాగానే ఒకతలని పూర్ణాహుతిచేసేవాడు.  పదివేలసంవత్సరాల తర్వాత తన పదవతల కూడా ఆహుతిచేస్తుండగా, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరమని అడుగుతాడట. 

మరణమేలేని వరం ప్రసాదించమన్నాడు. అది అసాధ్యం, మరి ఏదయినకోరుకొమ్మన్నాడు బ్రహ్మదేవుడు. మనిషి తనకు గడ్డిపరకతో సమానం. దేవ, దానవ, గంధర్వాదులందరి పేర్లు చెప్పి, వారి చేతిలో మరణం ఉండకుండా వరం కోరుకున్నాడు. బ్రహ్మ తధాస్తు అని పలికి, పోయిన తొమ్మిదితలలు కూడా ఇచ్చేసి అంతర్ధానం అయ్యాడు. 

కుంభకర్ణుడు గ్రీష్మఋతువులో అగ్నిమధ్య నిలబడి, వర్షఋతువులో వానలోనూ, శిశిరఋతువులో నీటిలో నిలబడి ఘోరతపస్సు చేసాడు. వాడికి వరమీయవద్దని దేవతలందరూ బ్రహ్మని కోరగా, సరస్వతీ దేవి కుంభకర్ణుని నాలుక మీద కూర్చొని, "నిర్దయ" అని కోరుదామనుకున్న కుంభకర్ణుని నోట "నిద్ర" అని అనిపించారు దేవతలు. తధాస్తు అనేసాడు బ్రహ్మ. వాడు ఆరు మాసాల నిద్ర, ఆరు మాసాల భోజనం. అంతే. 

విభీషణుడు  కూడ ఘొరమైన తపస్సు చెసాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయినపుడు, కష్టసమయాలలోనూ తను ధర్మం తప్పకుండా ఉండేలా వరమడిగాడట.  

ముగ్గురూ వారి ప్రాప్తమును బట్టి వరాలను పొందారు. అన్ని లోకాలను జయించినా, రావణుడు చివరికి గడ్డిపోచతో సమానమని అనుకున్న మనిషి, శ్రీరాముని చేతిలో మరణంపొందాడు. కుంభకర్ణుడు నిద్రలోనె మునిగిపోయాడు. ధర్మంతో ఉన్న విభీషనుడు చిరంజీవి కాగలిగాడు. 

అంటే..దేవుడిని మన ఇస్టానుసారం వరాలు అడిగినా,  ఎవరికి ఎపుడు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. రమణ మహర్షి భోధనలు అర్ధం చేసుకున్నవారికి అర్ధం అవ్తుంది. తృప్తికి మించిన సంపదలేదు. భగవంతుడు ప్రసాదించిన శక్తియుక్తులను వినియోగించుకుంటూ తృప్తితో, ధర్మం తప్పక జీవనం సాగించేవారికి  ఆనందం వెన్నంటే ఉంటుంది. 

ధర్మో రక్షతి రక్షితః 

   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి